Monday, January 16, 2012

Rajamouli's Eega Firstlook

 రాజమౌళి గుప్పెట్లో ‘ఈగ’
మన ఒంటిమీద ఈగో దోమో వాలిందనుకోండి... అప్పుడు మనమేం చేస్తాం?... చిటికెలో దాన్ని విదిలించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే... ఈగన్నా, దోమన్నా మనకు చాలా చులకన కాబట్టి. మనకన్నా చిన్న ప్రాణి మీద మనదెప్పుడూ అలాంటి భావనే కదా! అయినా ఈగను చూసి భయపడ్డానికి అదేమన్నా పులా? సింహమా? ఏమో... ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. గుర్రం ఎగరానూ వచ్చు,. తాడే పామై కరవనూ వచ్చు. అదే ఒకసారి జరిగింది కూడా. ఓ ఈగ తనకన్నా బలవంతుడైన మనిషిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఆశ్చర్యం కలిగించే ఈ కథంతా తెలియాలంటే రాజమౌళి రూపొందిస్తున్న ‘ఈగ’ సినిమా వచ్చేవరకూ ఆగాల్సిందే.
తన సినిమాల్లో ఎప్పుడూ ఏదో ఒక సమ్‌థింగ్ స్పెషాల్టీ చూపించే క్రియేటివ్ డెరైక్టర్ రాజమౌళి... ఈసారి ‘ఈగ’ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారు. ఆ తర్వాత ప్రాముఖ్యత కలిగిన పాత్రల్లో నాని, సమంత, సుదీప్ నటిస్తున్నారు. డి.సురేష్‌బాబు సమర్పణలో వారాహి సినిమా పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ విభిన్న కథా చిత్రానికి హేమాహేమీలైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. రాజమౌళిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమంటే తను తీసే కథేంటో ముందుగానే అందరికీ చెప్పేస్తారు. చాలామంది దర్శకులు ఆ పని చేయరు. మగధీర, మర్యాద రామన్న చిత్రాలకు షూటింగ్ ప్రారంభం రోజునే తను తీయబోయే కథ ఏమిటో చెప్పేశారు రాజమౌళి.
‘ఈగ’కు కూడా అదే సంప్రదాయాన్ని పాటించారు. సినిమా మొదలైన అరగంటకే హీరో చనిపోతాడట. అయితే అతని ‘ఆత్మ’ ఓ ఈగలోకి చేరుతుంది. ఆ ఈగ విలన్‌పై ఎలా పగ సాధించిందన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. ‘ఈగ’ ఫస్ట్‌లుక్‌ను సంక్రాంతినాడు రాజమౌళి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. ప్రేమ, వినోదం, ఉత్కంఠ కలగలిసిన చిత్రమిది. ఇందులో మూడు పాటలుంటాయి. కీరవాణి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. వచ్చే నెలలో ఆడియో విడుదల చేస్తాం. సినిమా విడుదల వేసవిలో ఉంటుంది’’ అని చెప్పారు.

No comments:

Post a Comment